Archive for October, 2010

భక్తి : కవిత కవి: శ్రీమాన్ అద్దంకి శ్రీరంగాచార్యులు

October 21, 2010
భక్తి : కవిత
కవి: శ్రీమాన్ అద్దంకి శ్రీరంగాచార్యులు
1.
బిడ్డతల్లికై విలపించు పిక్కటిల్లు
మొక్క వెలుగుకై వీక్షించు మ్రొక్కుచుండు
నట్టి సహజ భక్తిని నేను నార్తితోడ
వేడుచుంటిని నినుగోరి వేగరావె!
2.
మధ్య మధ్య అదెందుకో మందగిల్లు
భక్తి నీమీద నయ్యది బాధ గొల్పు
నీదులోపంబుగాదోచు నీరజాక్ష!
భక్తి కలిగించు కాపాడు భక్తవరద!
3.
చీమలో మరి బ్రహ్మలో శివునియందు
వెలయుచున్నట్టి యో దేవ! వేరులేక
అన్నిజీవుల బ్రేమతో నాదరింతు
అదియు నా సమారాధన మందుకొనుము.
4.
రాముని భక్తితో గొలచి రాగసుధా రసపాన మత్తతన్
నామము జేయుచున్ మదిని నాదగు వాంఛలు వీటిబుచ్చి నే
కామములేని భక్తినిల గానము జేయుచు సొక్కుసుందు నా
రాముని దివ్యపాదముల రంజనతో భజియించు సర్వదా.
Advertisements

SrikrishNudu: Kavitha by ASR

October 21, 2010
శ్రీకృష్ణుడు: కవిత
కవి: శ్రీమాన్ అద్దంకి శ్రీరంగాచార్యులు
1.
ఓయి శ్రీకృష్ణ రావోయి, హాయిగాను
పాడు మింకొకసారి నా పజ్జ నిల్చి
యాడు మాపాట పాడి నా యంతరాత్మ
పొంగి పొరలంగ చలమేల భువిని సఖుడ.
2. వీనులు నిండెను నీ మృదు
గానము విన్నంతలోన కరెగెన్ మనసున్
పూనుము మురళిని మరలను
మానక ననుజేర రమ్ము మాధవ వేగన్.
3.
మురళీ గానంబు వీనుల మ్రోగుచుండె
పరిమళంబులు గాలిలో పరుగులిడును
గాలి సోకిన నా మేను గగురు గొల్పు
వేగరావయ్య! గోపాల! వేగరమ్ము!
4. సకలశాస్త్రముల్ నేర్చిన చక్కనయ్య
విశ్వమంతయు నీదిగా విమలగాత్ర!
సర్వ లావణ్యమూర్తివి చారునేత్ర!
నీకె తగియుండు గర్వంబు నీరజాక్ష.
5.
చంటిపాపల చిందులో గంటినేను
ముద్దు బాలిక నగవులో మురిసి మురిసి
కోమలాంగుల చూపులో గోచరించు
యంద మెందెందు కనబడు నందె గలవు.
6. కొండవాగుల గంతులో గొంతసేపు,
కోకిలారవముల మరికొంత తడవు
కూన యిఱ్ఱుల చెలగాట గొంతసేపు
నాట్యమాడుచునుంటివా? నల్లనయ్య!
7.
జ్ఞానశక్తుల నెక్కడో జగతినెల్ల
త్రిప్పుచున్నట్ట్లు తప్పక యెప్పుకుందు
అట్టిశక్తికి రూపంబదెట్టిదనిన
జెప్పగాలేము రూఢిగా జెప్పలేము
8.
అట్టిఖండము గాననట్టి యాత్మ జ్ఞాన
సంపదలునాకు దయచేయు సాధుచరిత
పతన మేమియు లేకయే పాటు బడుచు
తుదకు నినుజేర కృషిజేతు ముదముతోడ
*********************************

శిల్ప-శిల్పి సంభాషణ

October 6, 2010
శిల్ప-శిల్పి సంభాషణ
కవిత శ్రీమాన్ అద్దంకి శ్రీరంగాచార్యులు.
దీనిలో ఒక శిల్పము తనను చేసిన శిల్పి మధ్య,
కవి  ఎదుట ఊహతో జరిపిన సంభాషణ;
1. శిల్పము :
చలువ రాతిలో జిత్రించి జాలి లేక
వస్త్ర హీనంబు గావించి పట్టపగలు
రచ్చ కీడ్చిన శిల్పిని రంభయలిగి
తిట్టిచున్నది నాముందు గిట్టు లేక.
2. కొంటెవారలు నామీద కొంత సేపు
చూపునిగిడించి వింతగా చూచుచుంద్రు
ఆడుదాని మొగంబునే చూడనటుల,
వాచిపోయెను కాబోలు వారి మనసు.
3. శిల్పి:
ఎన్ని కలలను గంటినో యెంచలేను
వీధి వీధిని విహరించి విసుగు లేక
విశ్వమంతయు గాలించి వెదకినాను
తుట్ట తుదకు కంటిని నిను తోయజాక్షి
4.
సకల సంపూర్ణ సుకుమార చారువదన
నిన్ను నీ రీతి సృష్టింప నేను నెట్టి
యోగసిధ్ధులు నార్జించి త్యాగమొప్ప
ధారపోసితినో నీకు తట్టలేద?
5.
గొప్పవారల సౌధాల కొల్లగొట్టి
పూరి గుడిసెలలోకెల్ల దూరి నేను
రకరకంబుల రమణలు రమ్యతలను
ప్రోగుగా జేసియు నీమీద పొదిగినాను.
6.
అట్టి యందమున్ దాచంగ నర్ధమేమి
మర్మెందుకే యందంపు మగువ నీకు
చీరె గట్టుట వింటివా చిలుక రాణి
వస్త్రధారణ మానవ వక్రరీతి.
7.
పుట్టునప్పుడు కట్టునా పట్టుబట్ట
కాటి గట్టున వర్జించు కట్టుబట్ట
మధ్యనెందుకు కట్టుటల్ మనుజ జాతి
డాబు దర్పంబుగా కేమి డబ్బుల ఖర్చు.
శిల్పము:
8.
మానరక్షణ గావించు మనచునిన్ను
నాడు పాచాలి ఆర్తితో వేడుకొన
బ్రోవగాలేద గోపాల బ్రోవుమయ్య
దేవ ! కాపాడు మోదేవ దీనురాల.
ఇవి ఆ కవిత్వము లోని కొన్ని పద్యాలు మాత్రమే!
ఈ పద్యాలు చాల ప్రజాదరణ పొందాయి.
మీకు ఎలా నచ్చాయో చెప్పండి!

Telugu Poetry by ASR

October 1, 2010

కవిత కీ| శే| శ్రీమాన్ అద్దంకి శ్రీరంగాచార్యులు

ఉద్దేశ్యము:

చంటి పిల్లలకేనియు సరసరీతి

అర్ధమగు భాష లో నార్తి తోడ

మధుర సుకుమార లావణ్య మధువు జిల్కు

 కవిత కర్తకు నిజముగ ఘనత గూర్చు.

కళలు :

 1. కళల నన్నిటి బెనవేసి కలిపి కట్టి

 మోక్ష దుర్గంబు నెగబ్రాక మోకునల్లి

భక్తియను నుడుమును గట్టి పట్టనిచ్చి

 పట్టువిడవక నిక్కంబు ఫలము దక్కు.

2. అన్నమునుదిని యాకలి నాపుకొందు

 దప్పికయు దీరు నీరమున్ ద్రాగినంత

ఆత్మవేదన నేనెట్టు లాపగలను

రాగసుధను నే మనసార ద్రాగకున్న

3. మానవాళిని నూగించె మధుర భక్తి

 గాన సాహితీ డోలికన్ ఘనులు వారు

కవులు సంగీత వాగ్గేయ కారులైన

వారియందరుకును నాదు వందనములు

4. పాటబాడిన బాములు పాపలైన

పశువులైనను కఠినులు పాపులైన

పరవశంబున దలలూపి భావమందు

 గానరసమును గ్రోలుదురు కనులు మూసి